లక్నవరం చెరువుకు దేవాదుల నీళ్లు ఎప్పుడొస్తాయి?

  • పదేళ్లుగా పైప్‌లైన్ పనులు పెండింగ్‌..
  • వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : లక్నవరం చెరువుకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టాల్సిన పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తీగల ఆదిరెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి పదేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన పురోగతి లేదన్నారు.

లక్నవరం చెరువుకు దేవాదుల నీటిని తరలించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినట్లు ఆదిరెడ్డి తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా ఆచరణలో మాత్రం ముందడుగు పడలేదని పేర్కొన్నారు.

25 వేల ఎకరాలకు సాగునీటి ఆధారం

ప్రస్తుతం వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సుమారు 20 నుంచి 25 వేల ఎకరాల సాగు అవసరాలను తీర్చే లక్నవరం చెరువు గోవిందరావుపేట మండల రైతులకు కీలకమైన నీటి వనరుగా ఉందన్నారు. లక్నవరం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండటంతో పాటు, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో కూడా నీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆదిరెడ్డి పేర్కొన్నారు.

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి

రైతుల సాగునీటి అవసరాలు, లక్నవరం పర్యాటక ప్రాధాన్యత, మేడారం జాతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా దేవాదుల నుంచి లక్నవరం చెరువుకు పైప్‌లైన్ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్నవరం చెరువుకు దేవాదుల నీరు చేరే వరకు రైతుల పక్షాన తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.