గోరింటాకు వేడుక
మహిళల సందడి
ఊట్కూర్, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): భారతీయ సంప్రదాయంలో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉందని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఎస్‌ఎస్‌కే సమాజ్ అధ్యక్షుడు చౌద్రి అశోక్‌రావు, మహిళా అధ్యక్షురాలు రాధా చంద్రప్రకాష్ అన్నారు. గోరింటాకు అలంకరణకే కాకుండా సహజసిద్ధమైన వనరుగా కూడా తరతరాలుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అంబ భవానీ మాత దేవాలయంలో ఎస్‌ఎస్‌కే సమాజ్ ఆధ్వర్యంలో శనివారం సామూహిక గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ రకాల ఆకర్షణీయమైన డిజైన్లతో గోరింటాకు పెట్టుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు పాల్గొని పాటలు, ఆటలతో సందడి చేశారు.
చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా వేడుకలను ఆసక్తిగా వీక్షించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గోరింటాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విడదీయరాని భాగమని అన్నారు. పూర్వకాలం నుంచి మహిళలు గోరింటాకును అలంకరణలో భాగంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. సహజ వనరుల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
సంప్రదాయ పండుగలు, వేడుకలు మహిళల్లో ఐక్యత, ఆత్మీయతను పెంపొందించడంతో పాటు భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ నిర్వహిస్తూ సంప్రదాయాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎస్‌ఎస్‌కే సమాజ్ సభ్యులు, మహిళలు, యువతులు, చిన్నారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
