August9Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఆగస్టు 12 అంతర్జాతీయ యువ దినోత్సవం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏ దేశానికైనా యువశక్తి ముఖ్యం. యువతే కీలకం. ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా, అధికారంలో, వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్నా, ఏదైనా కొత్తగా చేయాలన్నా.. ముందుండేది యువతే. చేతిలో మొబైల్, తలలో ఐడియా, కళ్లలో కల.. ఇదీ నేటి యువత స్టైల్! కానీ, ఆ ఉత్సాహానికి సరైన దిశ దొరికితే అద్భుతాలు చేయగలరు. కానీ, అదే దిశ కానీ లేకపోతే.. గంటలకొద్దీ రీల్స్ చూస్తూ కాలం కూడా గడిపేస్తే…?

అందుకే ప్రతి ఏడాది ఆగస్టు 12న వచ్చే అంతర్జాతీయ యువ దినోత్సవం కేవలం ఒక రోజు జరుపుకునే వేడుక కాదు. యువత ఏం కోరుకుంటోంది? ఏం ఆలోచిస్తోంది? వారి ముందున్న సమస్యలేంటి? వారి కలలకు మనం ఎంత వరకు సహకరిస్తున్నాం? అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన రోజు.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో యువత సంఖ్య తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఆ దేశాలలో “రేపు పని చేసేది ఎవరు?” అనే ప్రశ్న తీవ్రంగా వారిని వేధిస్తోంది.. కానీ భారత్‌ పరిస్థితి అందుకు భిన్నం. మన దేశంలో యువత పెద్ద సంఖ్యలో ఉంది. అంటే మన దగ్గర ఓ అద్భుతమైన సంపద ఉంది..శక్తి ఉంది. యువతను సరిగ్గా ఉపయోగించుకుంటే.. అదే యువత దేశానికి బలమైన ఆయుధంగా మారుతుంది.

కానీ ఇక్కడే అసలు కథ ఉంది.

ఒక అమ్మాయో, అబ్బాయిదొ చదువు పూర్తయింది. సర్టిఫికెట్లు వారి చేతిలో ఉన్నాయి. మరి ఉద్యోగం? “చూద్దాం.. ప్రయత్నిస్తున్నా..” అనే సమాధానం. ఒక ఉద్యోగం కోసం వందల మంది పోటీ. ఒక పరీక్ష కోసం లక్షల మంది దరఖాస్తులు. మరో వైపు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెడదామంటేవారికి పెట్టుబడి సమస్య. లేదా ఉద్యోగం వస్తే జీతం ఎంత? ఆ ఉద్యోగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందేహాలు. ఇలా చూస్తే యువత దగ్గర ఉత్సాహం ఉంది.. కానీ అవకాశాల కోసం ఆత్రుత ఉంది.

ఇక ఇంట్లో పరిస్థితి మరోలా ఉంటుంది. “బాగా చదువు” అంటారు తల్లిదండ్రులు. “మా మాట విను” అంటారు పెద్దలు. కానీ అమ్మాయి/అబ్బాయి ఏం కావాలనుకుంటున్నాడు? అతని ఆసక్తి ఏంటి? అతనికి/ఆమెకి ఉన్న సామర్థ్యం ఏంటి? అని అడిగే వారు మాత్రం ఎంత మంది?

ఒకప్పుడు డాక్టర్, ఇంజినీర్, ప్రభుత్వ ఉద్యోగం.. ఇవే పెద్ద కలలు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎవరో ఒకరు యాప్‌ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇంకొకరు స్టార్టప్‌ గురించి ఆలోచిస్తున్నారు. మరొకరు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇంకొకరు సినిమాలు, క్రీడలు, డిజిటల్‌ మీడియా, కృత్రిమ మేధ వంటి కొత్త రంగాల్లో తమ సామార్థ్యాన్ని నమ్ముకుని కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. ఇది తప్పు కాదు. కాలం మారింది కాబట్టి కలలు కూడా మారాలి కదా! ఇటీవల కృత్రిమ మేధ వంటి సాంకేతికతలు వేగంగా మారుతున్నాయి. కొన్ని పాత ఉద్యోగాల స్వరూపం మారుతుంటే, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అంటే యువతకు ఒకవైపు భయం ఉన్నా.. మరో వైపు అంతకు మించి పెద్ద అవకాశం కూడా ఉంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రపంచమే ఒక పెద్ద తరగతి గదిగా మారి పోయింది. నేర్చుకుంటూ…తెలుసుకుంటూ…ఎన్నుకున్న రంగాల్లో ఎవరెస్టును అధిరోహిస్తున్నారు.

వీటన్నిటితోబాటు రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు యువత. ఎన్నికల సమయంలో యువ ఓటర్ల నిర్ణయం చాలా పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపుతోంది. సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని నిర్భయంగా వెలిబుచ్చడం నుంచి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం వరకు యువత పాత్ర చురుగ్గా మారింది. వారికి నచ్చితే ప్రశంసిస్తున్నారు.. నచ్చకపోతే వెంటనే ప్రశ్నిస్తున్నారు. అంటే “మాకు ఏం కావాలో మాకు తెలుసు” అనే తరం ఉదయిస్తోంది.

అయితే యువత కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రశ్నించడం ఎంత ముఖ్యమో.. బాధ్యత తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వాన్ని విమర్శించడం సులభం. కానీ మన పరిసరాల్లో ఒక సమస్యను పరిష్కరించడానికి ముందడుగు వేయడం విమర్శించినంత సులభం కాదు. సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టడం కంటే, నలుగురిని కలుపుకొని పని చేయడం, చేయించడం పెద్ద విషయం.

దేశానికి కావాల్సింది కేవలం ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత కాదు. తమ కొత్త ఆలోచనలతో ఉపాధి, ఉద్యోగాలు సృష్టించే యువత కూడా కావాలి. సమస్యలను చూసి పక్కకు తప్పుకునే యువత కాదు.. పరిష్కారం కోసం ప్రయత్నించే యువత కావాలి.

ఒక చిన్న గ్రామంలోని యువకుడు కొత్త వ్యవసాయ పద్ధతిని నేర్చుకుని పది మంది రైతులకు చెబితే.. అది కూడా దేశ నిర్మాణమే. ఒక విద్యార్థి తన పాఠశాలలో చెత్త సమస్యను పరిష్కరించడానికి ముందుకొస్తే.. అదీ నాయకత్వమే. ఒక యువతి తనకు వచ్చిన అవకాశంతో మరో నలుగురికి ఉద్యోగాలు కల్పిస్తే.. అదే నిజమైన యువశక్తి.

అందుకే యువతను కేవలం “రేపటి నాయకులు” అని చెప్పడం కూడా సరిపోదు. వాళ్లు ఈరోజు నుంచే దేశాన్ని ప్రభావితం చేస్తున్నారు.

వాళ్ల చేతిలో ఫోన్ ఉంది. టెక్నాలజీ ఉంది. సమాచారం ఉంది. ఆలోచించే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు కావాల్సింది ఒక్కటే.. సరైన దిశ.

ఇంట్లో తల్లిదండ్రులు కాస్త నమ్మకం ఇవ్వాలి. విద్యాసంస్థలు మార్కుల వెనకే పరుగెత్తకుండా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వాలు యువతకు అవకాశాలు కల్పించాలి. యువత కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండాలి.

ఎందుకంటే యువత బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. యువతలో ఆశ ఉంటే దేశంలో ఆశ ఉంటుంది. యువతలో కొత్త ఆలోచనలు ఉంటే దేశం కూడా కొత్త దారులు వెతుక్కుంటుంది.

యువతకు దారి చూపడం అంటే.. దేశానికి దిశ చూపడమే.

ఆగస్టు 12న యువ దినోత్సవం జరుపుకోవడం ఒక రోజు పని. కానీ యువతను అర్థం చేసుకోవడం, వాళ్ల మాట వినడం, వాళ్ల కలలకు తోడుగా నిలవడం మాత్రం నిరంతర ప్రక్రియ.


-మాధవ్, కార్టూనిస్ట్

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

అనువుగాని చోట..

మన చుట్టూ అతి సామాన్యంగా కనిపించే వ్యక్తుల్లో అద్భుతమైన టేలెంట్ ఉంటుంది. అంటే మంచి గాయకులో , రచయితలో , చిత్రకారులో ఉంటారు వాళ్ళల్లో.కానీ మనకు అది తెలుసుకునే అవకాశం రాదు చాలాసార్లు. దానికి కారణం వాళ్ళు తమలోని టేలెంట్ ను ప్రదర్శనకు పెట్టకపోవడం కూడా కారణం కావచ్చు. అయితే ఎందుకు వాళ్ళు ఇలా తమలోని టేలెంట్ ను ప్రదర్శించరు అనే సందేహం కలుగుతూ ఉంటుంది నాకు.
మా ఆఫీసులో నాకు తెలిసిన ఒక ఉద్యోగి మంచి రచయిత.పత్రికల్లో వ్రాస్తూ ఉంటాడు.కానీ ఎప్పుడూ తను ఒక రచయితని అని చెప్పుకోడు .అలాగే ఇంకో కుర్రాడు మంచి చిత్రకారుడు.బయట ఎగ్జిబిషన్స్ లో తన చిత్రకళా ప్రదర్శన చూపిస్తాడు కానీ ఆఫీసు లో మాత్రం ఎవ్వరికీ తెలీదు. ఒకసారి నేను వాళ్ళని అడిగాను ” మీ టేలెంట్ ను ఆఫీసు కార్యక్రమాల్లో ఎందుకు ప్రదర్శించరు ? ” అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే ” మన ఆఫీసు వాతావరణం కళలకు , వాటి ప్రదర్శనకు అనువుగా ఉండదు సార్.ఎక్కువభాగం సైన్స్ , టెక్నాలజీ మీద ఫోకస్ ఉంటుంది. మా టాలెంట్ కి ఆదరణ తక్కువ.అందుకే మేము మా టాలెంట్ ఇక్కడ ప్రదర్శించడం లేదు ” అని చెప్పారు. నా సందేహం నివృత్తి అయింది.
మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ” అనువుగాని చోట అధికుల మనరాదు కొంచముండుటెల్ల కొదువ గాదు ” అని. అలాగే ఈ కుర్రాళ్ళు కూడా ఆఫీసులో అవసరమైన టెక్నికల్ పని మీద శ్రద్ధ చూపుతూ , బయట మాత్రం తమలోని కళను ప్రదర్శిస్తున్నారు. ఆఫీసు లో మాత్రం ఒక ఉద్యోగి లా అణకువగా ఉంటున్నారు. వాళ్ళు చేస్తున్నది కరెక్టే అని నాకు అనిపించింది.మీరు కూడా అది కరెక్ట్ అని ఒప్పుకుంటారు కదా ఫ్రెండ్స్ !!!

టోన్ డెఫ్

మూగబోయిన కంఠాలు. అన్యాయాన్ని చూసి, ఆక్రందనలు విని, అన్నార్తుల కష్టాలు తెలిసి, మాట్లాడాల్సిన కంఠాలు మూగబోతే, మౌనం మోహనంగా ధరిస్తే….?

టోన్ డెఫ్, జెన్ జీ ఈ మధ్య ఎక్కువ ఉపయోగించిన పదం. ఇది మ్యూజిక్ కి సంబంధించిన ఒక థియరీ. సంగీతం వింటున్నప్పుడు అందులో వచ్చే డిఫరెంట్ నోడ్స్ ను గుర్తించ లేకపోవడాన్ని టోన్ డెఫ్ అంటారు. ఇది అసలు అర్థం.

చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా, అసలు ప్రజల మూడ్ అవగాహన లేకుండా, Insensitive గా మాట్లాడటాన్ని, లేదా అలా మాట్లాడేవాళ్లని టోన్ డెఫ్ గా జెన్ జీ చెబుతోంది. ఈ కొత్త పదాన్ని వాళ్ళు ఈ అర్థంతో కాయిన్ చేసారు.

మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, లేదా మీ చుట్టూ అలా ఎవరైనా ఉంటే గుర్తించండి. అది ఒక మానసిక రోగమా? లేదంటే సొంత లాభం కోసం ఒక ఎజెండా పెట్టుకుని మాట్లాడుతున్నాడా? Identify చెయ్యండి.

Time, Space and Casuation, కాలం, స్థలం, పరిస్థితులు ఇవే సృష్టికి మూలం. ఈ మూడు పట్టించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడతాం అంటే వ్యర్థం కదా! శివుడు, అమ్మవారు, విష్ణువు వీరు ముగ్గురే అతి ప్రధానం హిందూ ధర్మంలో, దర్శనంలో, సాధనలో. మిగతావారు వారి పరివారం అంతే. గణపతి, కుమారస్వామి వారి కుమారులు. కార్య కారణ సంబంధం లేకుండా ఈ సృష్టి లేదు. కానీ కలియుగంలో మనుషులు శృతి, సృష్టి, ప్రకృతి వీటిని పట్టించుకోకుండా స్వార్థం, అహంకారం, అత్యాశ ఈ మూడు కలిసిన రాజ్యాంగం ఒకటి రాసుకుని దాని ప్రకారం నడుస్తున్నారు.

చర్య, క్రియ, యోగం, లక్ష్యం అనే ప్రధాన భాగాలు పట్టించుకోకుండా, నేడు అన్ని రంగాల్లో తమ స్వాహా రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఒక వారం క్రితం గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ జరుపుకున్నాం. సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే కన్నా ఇదే గొప్పది. ఆగస్టు రెండవ తారీఖు Friendship Day స్నేహితుల దినోత్సవం. అవి మన జంబూ ద్వీప పండుగలా? Western Influence అని చర్య, క్రియ …ఆ భాగాలు కోణంలో ఆలోచించి ప్రజల మూడ్ ను బట్టి, ప్రభుత్వాలు, నాయకులు మాట్లాడాలి.

మరణం ఇంటికి వెళ్లి, చిరునవ్వులు, జోకులు వేస్తే ఎలా? నిజం నేటి కాలంలో మనుషులు కలవాలి అంటే చావో, తద్దినమో ఉంటే కానీ కుదరడం లేదు. స్నేహం స్నేహం కోసం ఉండడం లేదు. అవసరం, స్వార్థం రెండు గుర్రాలై నడిపిస్తున్నాయి.

బంధువులు కూడా అంతే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు, పద్యం మనకు తెలుసు.

ఎల్ నినో ప్రభావం దాటి, రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. జలాశయాలు నిండాయి. గోదావరి మొదటి రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మొన్న వారం. శుభం భూయాత్.

ఇక టోన్ డెఫ్ అర్థం తెలిసింది కాబట్టి, క్షేమేంద్రుడి ఔచిత్యం ప్రధాన సిద్ధాంతం ఎలాగు ఉంది, విజ్ఞతతో మన నాయకులు, మనం అడుగులు వేయాలి అని కోరుకుందాం. Common sense is very uncommon in common people. అది అబద్దం అని నిరూపించాలి మొత్తం సమాజం, జ్ఞానం వైపు జనాన్ని నడిపించి. కవులు, కళాకారులు, మేధావులు, టీచర్స్, నాయకులు టోన్ డెఫ్ తో ఉండకూడదు!

సర్వే జనా సుఖినోభవంతు!

40 ఏళ్లుగా ధ్వజపటం చిత్రించే సేవా భాగ్యం

తిరుమల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణానికి అవసరమైన గరుడ ధ్వజాన్ని 40 ఏళ్లుగా చిత్రించే అరుదైన భాగ్యం పేరూరు శివప్రసాద్ అనే చిరుద్యోగికి దక్కింది. టి టి డి ఉద్యోగిగా దక్కిన ఆ సేవాభాగ్యం పదవీ విరమణ చేసినా కూడా ఇప్పటికీ అతడినే వరించి ఉండడం చెప్పుకోదగిన విశేషం.
తిరుమలలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల మొదటిరోజున ఆలయంలో ధ్వజారోహణం అనే ఆగమోక్త కార్యక్రమం జరుగుతుంది. పసుపు వస్త్రం పై చిత్రీకరించిన గరుత్మంతుని చిత్రాన్ని మాడ వీధులలో ఊరేగించి, వైఖానస ఆగమోక్తంగా ఆలయ ధ్వజ స్థంభంపై ఆరోహింప చేయడమే ఆ కార్యక్రమ విశేషం. ఆ ధ్వజారోహణను స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభ సూచనగానే కాక సకలలోక వాసులకు పంపే ఆహ్వానం గా చెబుతారు. కాలక్రమంలో ప్రతి ఏటా చేసే ధ్వజపటాన్ని చిత్రీకరించే పనిని ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా టీ టీ డి అధికారులు ప్రైవేటు కాంట్రాక్టు కు అప్పగించేవారు. 1986 లో ధ్వజారోహణ పవిత్రత ను దృష్టిలో ఉంచుకున్న అప్పటి టీ టీ డి ఈ ఓ లక్ష్మీనారాయణ స్థానిక ఉద్యోగుల్లోని చిత్రకళాకారులకే బాధ్యత ను అప్పగించాలని భావించారు.

ఆ ఆలోచనకు అప్పటి ఆలయ ఆగమ పండితులు ఆమోద ముద్ర వేయడంతో టీ టీ డి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే చిత్రకారుడు పేరూరు శివప్రసాద్ కు ఆ భాగ్యం లభించింది. ఆయన ఆగమ పండితుల సూచన మేరకు నియమాలను పాటిస్తూ గరుడ పటాన్ని చిత్రీకరించారు. దానికి అందరి ఆమోదం లభించడంతో గత 40 ఏళ్లుగా గరుడ ధ్వజపటాన్ని ఆయనే చిత్రీకరిస్తూ వస్తున్నారు. కొన్నేళ్ల ముందు పదవీ విరమణ చేసినా గరుడపటాన్ని చిత్రించే భాగ్యం ఆయనకే లభిస్తోంది. అందుకు తగినట్టుగానే 70 ఏళ్లకు చేరువ అవుతున్నా ఆయన కొన్ని నియమాలను పాటిస్తూ, నిష్ఠగా రెండు, మూడురోజుల పాటు ఆ ధ్వజపటాన్ని ఒక దీక్షగా చిత్రించి బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయానికి తీసుకువెళ్లి సమర్పిస్తుంటారు. ఇప్పటికీ ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చి మరీ తనకు టీ టీ డి పెద్దలు బాధ్యత అప్పగించడానికి
శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే కారణమని శివప్రసాద్ భావిస్తారు.

ఓం నమో వేంకటేశాయ