సాగుకు రేపు నీటి విడుదల..
- కడెంలో నిర్వహించే సాగునీటి సమావేశంలో నిర్ణయం..
- ఇద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సాగు నీటి విడుదల..
- నీటిపారుదల శాఖ ఎస్సీ వెల్లడి
జన్నారం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని ఆదివారం విడుదల చేయనున్నారు.ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కడెం మండల కేంద్రంలో ప్రాజెక్ట్ సాగునీటి యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఆ ప్రాజెక్ట్ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రాజెక్టు నుంచి సాగునీరు ఆదివారం ఉదయం విడుదలకు నిర్ణయం తీసుకోనున్నారు.ఈ విషయమై ఆదిలాబాద్ నీటిపారుదల శాఖ ఎస్సీ వెంకట రాజేంద్రప్రసాద్ ను శనివారం మధ్యాహ్నం ఫోన్లో సంప్రదించగా, ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు జరిగే నీటిపారుదల శాఖ యాజమాన్య కమిటీ సమావేశంలో ప్రాజెక్టు నుంచి రేపు సాగునీరు విడుదలకు నిర్ణయం తీసుకుంటారన్నారు.

నిండుకుండలా కడెం ప్రాజెక్టు..
కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ సాగునీరుతో నిండుకుండలా ఆగిపిస్తుంది.ఆ ప్రాజెక్ట్ నీటి నిలువ సామర్థ్యం 700 అడుగులు కాగా, శనివారం మధ్యాహ్నం గంటలకు 699.750 అడుగులు నీరు నిల్వ ఉంది.ఆ ప్రాజెక్ట్ కు కుడి,ఎడమ ప్రధాన కాలువలు ఉన్నాయి. ప్రాజెక్టు కుడి కాలువ కడెం మండలంలోని రైతుల వరి పొలాలకు సాగునీరు అందిస్తుండగా,ఎడమ ప్రధాన కాలువ నిర్మల్ జిల్లా కడెం,దస్తురాబాద్, మంచిర్యాల జిల్లా జన్నారం,దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని 68150 ఎకరాల వరి పంట పొలాలకు సాగునీరు పారనుంది. ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటి విడుదల కోసం రైతులు ఎప్పుడెప్పుడాఅని ఎదురుచూస్తుండగా, శుక్రవారం పలు మండలాల్లో సాగునీరు విడుదల చేయాలని రైతులు రాస్తారోకోలు చేశారు.దీంతో తక్షణమే నీటిపారుదల శాఖ అధికారులు ఇద్దరు ఎమ్మెల్యేలతో సంప్రదించి,కడెం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ యాజమాన్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది.

