పేరుకే హెడ్ క్వార్టర్..
- పేరుకే నియోజకవర్గ కేంద్రం..
- కార్యాలయాలు మాత్రం ఇతర ప్రాంతాల్లో!
- చిన్న పనికైనా నూజివీడుకు పరుగులు..
- ప్రజల అవస్థలు ప్రజలకు అందని ప్రభుత్వ కార్యాలయాలు..
- చింతలపూడి వాసుల ఆవేదన
చింతలపూడి, ఆంధ్రప్రభ : పేరుకే చింతలపూడి నియోజకవర్గ కేంద్రం. కానీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ప్రజలు, క్షేత్రస్థాయి అధికారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్), రెవెన్యూ తదితర శాఖల సబ్‌డివిజన్ కార్యాలయాలు నియోజకవర్గ కేంద్రంలో లేకపోవడంపై ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల సబ్‌డివిజన్ కార్యాలయాలు చింతలపూడిలోనే ఉండేవి. దీంతో గ్రామీణాభివృద్ధి, తాగునీటి సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యవహారాలు స్థానికంగానే పరిష్కారమయ్యేవి. అయితే జిల్లాలు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత పంచాయతీరాజ్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని నూజివీడుకు, ఆర్‌డబ్ల్యూఎస్ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెంకు తరలించారు.
నూజివీడుకు వెళ్లాల్సిన పరిస్థితి
చింతలపూడి, లింగపాలెం మండలాలకు సంబంధించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల పనుల కోసం ప్రస్తుతం నూజివీడుకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇరుకైన రహదారులపై ప్రయాణించడం వల్ల సమయం, ఖర్చుతో పాటు ప్రమాదాల భయం కూడా వెంటాడుతోందని చెబుతున్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అందుబాటులో లేరని ఆరోపణలు
తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గ కేంద్రంలో ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. మండల స్థాయి అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నాయి.
గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ఖాళీ
గృహ నిర్మాణ శాఖ సబ్‌డివిజన్ కార్యాలయం చింతలపూడిలో ఉన్నప్పటికీ, రెగ్యులర్ డీఈ లేకపోవడంతో కార్యాలయం ఖాళీగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భవనాన్ని ఎమ్మెల్యే రోషన్ నియోజకవర్గ ప్రణాళిక కార్యాలయంగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
మళ్లీ చింతలపూడికే కార్యాలయాలు తీసుకురావాలని డిమాండ్
నియోజకవర్గానికి సంబంధించిన సబ్‌డివిజన్ కార్యాలయాలు తిరిగి చింతలపూడిలోనే ఏర్పాటు చేయాలని, చింతలపూడి, లింగపాలెం మండలాలను మళ్లీ ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రజలకు అందుబాటులో పాలన ఉండాలంటే నియోజకవర్గ కేంద్రంలోనే అన్ని కీలక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
