గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
- చివటం గ్రామంలో రూ.1.20 కోట్ల సీసీ రోడ్ల ప్రారంభం
- రెండేళ్లలో రూ.6.82 కోట్ల పనులు: మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, ఆంధ్రప్రభ: నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో “పల్లె పండుగ 2.0” కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా గత రెండేళ్లలో చివటం గ్రామంలోనే వివిధ పథకాలు, నిధుల ద్వారా రూ.6.82 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఏళ్ల తరబడి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన రహదారుల సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు దీర్ఘకాలం మన్నికగా ఉండే నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ రహదారులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గ్రామాల రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడుతోందని పేర్కొన్నారు.
నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.28 కోట్ల ఎస్‌ఏఎస్‌సీఐ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.
