‘అడవితల్లి బాట’ పనులు వేగవంతం

  • రూ.2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి..
  • ఇప్పటికే 905 కి.మీ. పనులు పూర్తి..
  • పెండింగ్ పనులు వేగవంతం చేయాలి
  • అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: గిరిజన గ్రామాలను డోలీ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమం స్పష్టమైన పురోగతి సాధిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కార్యక్రమం పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో తొలి దశలో రూ.1,005 కోట్ల అంచనా వ్యయంతో 1,069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని విస్తరించి ‘అడవితల్లి బాట–2.0’ కింద మొత్తం రూ.2,078 కోట్ల వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి చేపట్టగా, ఇప్పటికే 905 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు.

సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అటవీ అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల మధ్య సమన్వయం చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వర్షాల కారణంగా ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో రహదారి నిర్మాణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

అడవితల్లి బాట కార్యక్రమంలో అనేక గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ముందుగా దారి ఏర్పాటే పెద్ద సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. కొండలను నియంత్రిత పేలుళ్ల ద్వారా తొలగించి, రాళ్లను పగలగొట్టి మార్గాలను ఏర్పాటు చేసిన అనంతరం రహదారుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా నిర్మాణ సామగ్రి తరలించడంలో ఇబ్బందులు ఎదురైనా, గిరిజన గ్రామాలను డోలీ కష్టాల నుంచి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

గిరిజన ప్రాంతాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారి నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.