అసలు భక్తి అంటే ఏమిటి?
భక్తి తత్త్వం-బాల భక్తులు
పూర్వపు యుగాల్లోను, కలియుగ ప్రారంభంలోను విద్య నేర్చుకోవడానికి గురువును వెతుక్కుంటూ, ఆశ్రమ విద్య పొందేవారు. ఆశ్రమ విద్యలో వేదము, ఉపనిషత్తులు, సారాంశము, వంటివి సంస్కృతంలో బోధించేవారు. అందుకే వారిలో ఆధ్యాత్మిక చింతన, ఆత్మవిశ్వాసం, ధర్మబద్ధమైన జీవితం, భక్తి వంటి అనేక సద్గుణాలు చోటు చేసుకున్నాయి. వారిలో ఎక్కువ మంది ”బ్రహ్మ జ్ఞానం” గురించి కృషి చేశారు.
అసలు భక్తి అంటే ఏమిటి? ఆలోచిస్తే, జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు, పెద్దలు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు వంటివారిని గౌరవించడం, ప్రేమగా నడచుకోవడం ఒక ఎత్తు అయితే, జన్మనిచ్చినది తల్లిదండ్రులు అయినా, బ్రతకడానికి తగిన వనరులు సృష్టించి, జీవితాలకు పరమావధికి మార్గాన్ని కల్పించిన భగవంతుని పట్ల అంకితభావం, ప్రేమ కలిగి తపించడమే భక్తి. గజేంద్ర మోక్షంలో ఆర్తితో శరణాగతి కోరినట్లుగా శరణాగతి పొందడమే భక్తి. అర్థార్థి (కోరికలతో) సుఖం, భోగాలకు ఈశ్వరుడిని ప్రార్థిస్తుంటాడు. అదే ఆత్మతత్త్వం తెలుసుకున్న జిజ్ఞాసువులు ఆర్తితో, తపనతో హృదయాన్ని అర్పణ చేస్తారు. ఈ కోవకు చెందిన కొంతమంది బాల భక్తుల గురించి తెలుసుకుందాం.
మనకు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగానే, నారదమ#హర్షి తన తల్లికి బోధించిన విష్ణుతత్త్వాన్ని విని, ఆకళింపు చేసుకున్నందువల్లనే గొప్ప విష్ణుభక్తుడు అయ్యాడు. ధ్రువుడు కూడా తండ్రి ప్రేమకై తపస్సు చేసి ధ్రువతారగా విశ్వంలో వెలుగొందుతున్నాడు.
ఉపమన్యువు అనే బాలుడు, తన తల్లితో మేనమామ గారి ఇంట్లో ఉన్న సమయంలో, మేనమామ భార్య తన పిల్లలకు గోవు పాలు ఇచ్చేది. ఉపమన్యువుకు తల్లి పిండి పాలు ఇచ్చేది. ఒకరోజు పిండి పాలు త్రాగను. నాకు ఆవు పాలే కావాలని దు:ఖిస్తుంటే, తల్లి ఓదారుస్తూ, ”నాయనా! శివుడు మనకు ఆవుపాలు ఇవ్వలేదు!” అంటే, ఇప్పుడే వెళ్ళి శివుడిని అడుగుతానని తపస్సుకు బయలుదేరి, ఘోరమైన తపస్సు చేసాడు. పరమేశ్వరుడు, పార్వతీ దేవితో ప్రత్యక్షమై, అతని భక్తికి మెచ్చి ఒక క్షీరసాగరము, ఒక దధిక్షీరము రెండు ఇచ్చి సంతోషపరచాడు.
అలాగే జానాబాయి అనే పాప తన చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పండరీపురం దర్శించింది. ఆ పాండురంగని చూస్తూనే తాదాత్మ్యానందం పొందింది. తల్లిదండ్రులు తిరిగి వెళ్ళిపోతుంటే, వెళ్ళక, ఇక్కడే నామదేవుడు అనే భక్తుని ఇంటిలో ఉంటూ, పాండురంగని సేవించేది. చివరికి ఒకసారి పుండరీకుడు ఆమె ఇంటికి వచ్చి ”జానాబాయి! నీ చేతి వంట తినాలనే వచ్చాను” అంటే, క్షణాలలో వంటచేసి పెట్టింది.
ఇటువంటి బాలభక్తులు ఎందరో ఉన్నారు. మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? అన్న నానుడి తెలిసిందే. అందుకే చిన్న వయసులోనే భక్తి తత్త్వం నేర్పాలి.
భాగవతంలో ప్రహ్లాదుడు చరిత్రలో ఒక చోట ”చిక్కడు వ్రతముల క్రతువుల
జిక్కడు దానముల, శౌచశీల తపముల
జిక్కడు యుక్తిని, భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!” అన్నారు.
వ్రతములు, క్రతువులు, దానాలు వంటివాటి వల్ల దేవుడు దొరకడు. కేవలం భక్తికి మాత్రమే చిక్కగలడు. అని. అందుకే ఆదిశంకరులు తన భజగోవింద శ్లోకాలలో వఢుడా! ఎందుకు కాలాన్ని వృథా చేస్తావు. మనస్సు పెట్టి ”గోవిందా! గోవిందా” అని ముమ్మారు తలుస్తూ శరణాగతి పొందుమని ##హచ్చరించారు.
ఊడుగ చెట్టు నుంచి విత్తనాలు పైనుంచి నేలపై పడినప్పుడు అవి గాలిలో తిరిగి, చెట్టుకే అంటుకుపోతాయి. అట్లే భక్తుల మనస్సు చివరకు భగవంతుని పాదాల చెంతకు చేరడం అంతే స#హజం. అని పెద్దలు చెబుతారు.
-అనంతాత్మకుల రంగారావు
