వెనిస్ – ఇటలీ – అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ (61) ( Jeff bezos ) తన ప్రియురాలు, మాజీ న్యూస్ యాంకర్ లారెన్ శాంచెజ్ (55) (laren sanchaze )తో కలిసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. సుందర నగరం వెనిస్‌లో శుక్రవారం వీరి వివాహం (Marriage ) అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
అట్టహాసంగా వివాహ వేడుక
ఇటలీ మీడియా కథనాల ప్రకారం చారిత్రక సెయింట్ మార్క్స్ స్క్వేర్‌కు ఎదురుగా ఉన్న శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అక్కడి విశాలమైన ఓపెన్-ఎయిర్ యాంఫిథియేటర్‌లో బ్లాక్-టై థీమ్‌తో పెళ్లి వేడుకను నిర్వహించారు. ప్రముఖ ఒపెరా గాయకుడు ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి తన గానంతో నూతన వధూవరులను, అతిథులను అలరించారు. మిషెలిన్-స్టార్ చెఫ్ ఫాబ్రిజియో మెల్లినో పెళ్లి విందును సిద్ధం చేయగా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ కేక్‌ను తయారు చేశారు.
ఈ వేడుకల కోసం బెజోస్, శాంచెజ్ గ్రాండ్ కెనాల్‌పై ఉన్న 16వ శతాబ్దపు విలాసవంతమైన అమన్ హోటల్‌లో బస చేశారు. కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్‌ఫ్రే, ఓర్లాండో బ్లూమ్, అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ టామ్ బ్రాడీ, గాయకుడు ఉషర్, జోర్డాన్ రాణి రానియా, ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్ వంటి ఎందరో ప్రముఖులు ప్రత్యేక బోట్లపై వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత లారెన్ శాంచెజ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేరును ‘లారెన్‌శాంచెజ్‌బెజోస్’గా మార్చుకుని, పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. కాగా బెజోస్ కు ఇది రెండో వివాహం .. మెకంజీ స్కాట్ తో తొలి వివాహం జరగగా, 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.