అప్రమత్తమైన లోకో పైలట్ .. తప్పిన భారీ ప్రమాదం

  • హుటాహుటిన చర్యలు చేపట్టిన రైల్వే అధికారులలు
  • పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

మందస(పలాస) , ఆంధ్రప్రభ: ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం సాయంత్రం మందస రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పలాస నుంచి రైల్వే ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది, ట్రాక్ మెయింటెనెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి గాడిలోకి తీసుకురావడంతో పాటు దెబ్బతిన్న ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసే పనులు చేపట్టారు. భారీ యంత్రాలు, ప్రత్యేక సాంకేతిక సిబ్బందితో మరమ్మత్తులు కొనసాగించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి.

భద్రతా కారణాల దృష్ట్యా పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని రైళ్లను నెమ్మదిగా నడపడంతో అవి నిర్ణీత సమయానికి ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించకపోవడం ఊరటనిచ్చింది. లోకో పైలట్ సమయస్ఫూర్తి, రైల్వే సిబ్బంది వేగవంతమైన చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

పట్టాలు తప్పడానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని, ట్రాక్ పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన అనంతరం రైళ్ల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువస్తామని రైల్వే అధికారులు తెలిపారు .