డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్
కవిత డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలోని కవిత డిగ్రీ కళాశాలలో శుక్రవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.
తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్‌కు అలవాటు పడితే కుటుంబంతో పాటు సమాజంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండి మాదకద్రవ్యాలకు సంబంధించిన ప్రలోభాలకు దూరంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
యువత తమ లక్ష్యాలను సాధించేందుకు చదువుపై దృష్టి సారించి కృషి చేయాలని సూచించారు. మంచి విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
