డీఎస్సీ అభ్యర్థులను మోసం చేశారు
- గొంతెత్తిన వారిపై పోలీసు దౌర్జన్యం
- ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
- డీఎస్సీపై చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి
- విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
- నిరుద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి
- ఆగస్టు 10న భారీ ర్యాలీతో ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
- వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
కృష్ణలంక, ఆంధ్రప్రభ: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసి, వారి తరఫున శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు తదితర డిమాండ్లతో చేపట్టిన రెండో రోజు రిలే నిరాహార దీక్షను శుక్రవారం పార్టీ నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షకు రెండు రోజుల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ, శిబిరానికి చేరుకున్న పోలీసులు టెంట్‌ను బలవంతంగా తొలగించడం, దీక్షా స్థలాన్ని కుదించడం, నిరసన తెలిపే హక్కును అణచివేయడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన చర్యలని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వం ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబితే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన కాకుండా నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. డీఎస్సీ అంశంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆగస్టు 10న భారీ ర్యాలీ..
ఆగస్టు 10న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించిన దేవినేని అవినాష్, ప్రజలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మండల అధ్యక్షులు చలపాటి సన్నీ, గద్దె కళ్యాణ్, మాజీ కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక, రహీనా నాహీద్, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు మాగంటి నవీన్, రిజ్వాన్, మొయిన్, దనేకుల ఇందిర, మునగ శేషు, శెటికం దుర్గ, చందా కిరణ్, బచ్చు మాధవి, స్వప్న, సుభాషిణి, సునీత తదితరులు పాల్గొన్నారు.

