“ప్రజల సమస్యలు విన్న అఖిలప్రియ.. పరిష్కారానికి హామీ”
ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ: నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఆళ్లగడ్డలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వృద్ధాప్య పింఛన్లు, నూతన గృహాలు, ఇంటి స్థలాల మంజూరు, పట్టాల పంపిణీ తదితర సమస్యలపై వినతిపత్రాలను భూమా అఖిలప్రియకు అందజేశారు. ప్రజల సమస్యలను పరిశీలించిన ఆమె, సంబంధిత అధికారులతో మాట్లాడి అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. నియోజకవర్గ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని భరోసా ఇచ్చారు.
