అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపిన కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడంతో బీఆర్ఎస్ పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమైన పార్టీగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అలాగే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆశించిన నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. అయితే గోదావరి జలాలు, బనకచర్ల అంశంలో తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా కాపాడిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన చామల.. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

