తాటిచెట్టుకు సీసీ కెమెరా..!
యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ: కల్లు దొంగతనాలను అరికట్టేందుకు ఓ గీత కార్మికుడు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. కల్లు గీసిన తర్వాత రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలిస్తుండటంతో ఏకంగా తాటిచెట్టుకే సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన గీత కార్మికుడు అన్నెపు శ్రవణ్ గౌడ్ రోజూ గీసే కల్లును కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో దొంగిలిస్తున్నారని తెలిపారు. దీంతో దొంగలను గుర్తించేందుకు తాటిచెట్టుపైనే సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాను అమర్చారు.
ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాంకేతికతను వినియోగించి కల్లు చోరీలకు అడ్డుకట్ట వేయాలని శ్రవణ్ గౌడ్ చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఈ కెమెరా ద్వారా దొంగల కదలికలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
