ఆటో, క్యాబ్, డెలివరీ సేవల నిరవధిక సమ్మె

16 వాహన, గిగ్ కార్మిక సంఘాల జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపు
ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో సేవలపై ప్రభావం
బేస్ ఫేర్, గిగ్ కార్మికుల సంక్షేమ బోర్డు సహా పలు డిమాండ్ల సాధనే లక్ష్యమని జేఏసీ వెల్లడి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రేపటి (ఆగస్టు 8) నుంచి ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, యాప్ ఆధారిత రవాణా సేవలు, ఫుడ్, గ్రోసరీ డెలివరీ సేవలు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు 16 వాహన, గిగ్ కార్మిక సంఘాల సంయుక్త చర్యల కమిటీ (జేఏసీ) సమ్మెకు పిలుపునిచ్చింది.

ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సేవలతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు కూడా సమ్మెలో పాల్గొంటాయని జేఏసీ ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు, ఆన్‌లైన్‌లో ఆహారం, నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేసే వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

తమ సమస్యలను ప్రభుత్వం పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ప్రభుత్వం స్పందించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, అగ్రిగేటర్ సంస్థలు కలిసి కనీస బేస్ ఫేర్‌తో పాటు ప్రతి కిలోమీటర్, ప్రతి నిమిషానికి న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, ఇతర గిగ్ కార్మికులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నాయి.

అలాగే తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025ను పూర్తిగా అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే కనీస చార్జీలను అమలు చేయడంతో పాటు కమర్షియల్ రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల, సరుకు రవాణా సేవలకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్లలో పేర్కొన్నాయి.

సమ్మె నేపథ్యంలో ప్రయాణాలు, డెలివరీ సేవలపై ఆధారపడే ప్రజలు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని వాహన సంఘాలు సూచించాయి.