చంచల్‌గూడ జైలు నుంచి ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు తరలింపు..

కోర్టు అనుమతితో విచారణ ప్రారంభం

హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న ఆయనను అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం విచారణ నిమిత్తం తమ అదుపులోకి తీసుకుని తరలించారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అర్ధరాత్రి చంచల్‌గూడ జైలుకు చేరుకున్న అధికారులు ఆయనను అధికారికంగా కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా నిర్వహించినట్లు సమాచారం.

కస్టడీ విచారణలో ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, ఇరువురి మధ్య జరిగిన కమ్యూనికేషన్, డిజిటల్ ఆధారాలు, స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు గత నెల ఈ కేసు నమోదు కాగా, అనంతరం దర్యాప్తును హైదరాబాద్ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలపై ఆసక్తి నెలకొంది.