హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం

  • రెండు కేసుల్లో హైడ్రా చర్యలను తప్పుబట్టిన ధర్మాసనాలు
  • 24 గంటల్లో బోర్డు తొలగించాలి..
  • తహసీల్దార్‌కు వ్యక్తిగత హాజరు ఆదేశం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కేసుల విచారణ సందర్భంగా హైకోర్టులోని రెండు ధర్మాసనాలు హైడ్రా చర్యలను తప్పుబడుతూ కీలక ఆదేశాలు జారీ చేశాయి. హయత్‌నగర్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డు ఏర్పాటు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన ఆ బోర్డును 24 గంటల్లో తొలగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మరో కేసులో కొండాపూర్‌లోని ప్రైవేట్ స్థలానికి సంబంధించి హైడ్రా జోక్యాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. పూర్తి స్థాయి విచారణ లేకుండానే హైడ్రాకు తప్పుడు సమాచారం అందించిన తహసీల్దార్ వ్యవహారంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత తహసీల్దార్ ఈ నెల 30న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యం, హైడ్రా తొందరపాటు చర్యలపై వరుసగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.