హోర్ముజ్ జలసంధి భద్రతకు ఉమ్మడి దౌత్య ప్రయత్నాలు…
- అమెరికా చర్యలపై ఇరాన్ మరోసారి తీవ్ర అభ్యంతరం
టెహ్రాన్, ఆంధ్రప్రభ : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రతను కాపాడేందుకు ఉమ్మడి దౌత్య ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలని ఇరాన్, ఒమాన్, సౌదీ అరేబియా నిర్ణయించాయి. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ, ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మధ్య సోమవారం రాత్రి వేర్వేరుగా టెలిఫోన్లో చర్చలు జరిగాయి. ఇరాన్ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, హోర్ముజ్ జలసంధి భద్రత, ప్రాంతీయ స్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని పెంచుకోవడంతో పాటు సమన్వయంతో కూడిన దౌత్య చర్యలు చేపట్టాలని ముగ్గురు మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికా చర్యల కారణంగానే జలసంధిలో భద్రతా సమస్యలు తలెత్తాయని ఇరాన్ మరోసారి ఆరోపించింది.
సురక్షిత నౌకాయానంపై చర్చలు
ఇటీవల టెహ్రాన్‌లో ఇరాన్, ఒమాన్ ప్రతినిధుల మధ్య హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానంపై ప్రత్యేక సమావేశం జరిగింది. జలసంధిని ఆనుకుని ఉన్న దేశాల సార్వభౌమ హక్కులను గౌరవిస్తూ సముద్ర రవాణా నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.
అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఇదిలా ఉండగా, అమెరికా నౌకాదళం ఇరాన్ నౌకలు, వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దిగ్బంధన చర్యలు కొనసాగిస్తే దానిని యుద్ధ విస్తరణగా పరిగణిస్తామని ఇరాన్ సైన్యానికి చెందిన ఖతమ్ అల్-అన్బియా కేంద్ర కమాండ్ హెచ్చరించింది. అలాంటి పరిస్థితులు ఎదురైతే తమ సాయుధ దళాలు తగిన విధంగా ప్రతిస్పందిస్తాయని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలు కొంత తగ్గినప్పటికీ, ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు ఇప్పటికీ సున్నితంగానే కొనసాగుతున్నాయి.
