AP | అదృశ్యమైన విద్యార్థినులు క్షేమం..
చిలకలూరిపేటలో గుర్తించిన పోలీసులు
AP | నకరికల్లు, ఆంధ్రప్రభ: నకరికల్లు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల నుంచి అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినులను పోలీసులు సురక్షితంగా గుర్తించారు. చిలకలూరిపేటలో వారిని అదుపులోకి తీసుకున్న నకరికల్లు పోలీసులు అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థినులు క్షేమంగా లభించడంతో వారి కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లడానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యార్థినులు అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే నకరికల్లు ఎస్ఐ సతీష్ అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులకు చిలకలూరిపేటలో ఇద్దరు విద్యార్థినులు కనిపించారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థినులను త్వరితగతిన గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన నకరికల్లు పోలీసుల తీరుపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
