ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
( విజయవాడ, ఆంధ్రప్రభ) : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగిందని.. అయినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీలించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను సమర్పించడం జరుగుతోందన్నారు. అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులు, సిబ్బందిని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో పాటు ఏదుపాటి రామయ్య (తెదేపా), పి. సురేష్ బాబు (బీజేపీ), వై.ఆంజనేయ రెడ్డి (వైఎస్ఆర్సీపీ), మురళీకృష్ణ (ఐఎన్సీ), జడగం శ్రీనివాసరావు (జనసేన పార్టీ), పవన్ కార్తీక్ (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.
