ధర్మాజీపేట్‌లో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు

భక్తుల సందడితో ఘనంగా బోనాల ఉత్సవాలు.. ప్రత్యేక పూజలు, అన్నదానం

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పూలతో అలంకరించి, అమ్మవారిని నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి, ఒక్కపొద్దులతో బోనాలు వండి, వాటిని పూలు, వేపరిల్లలతో అలంకరించి డప్పు చప్పుళ్లు, వాయిద్యాల నడుమ నృత్యాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ బోనాల ఊరేగింపులో బోనం ఎత్తుకున్న హిజ్రాలు, శివసత్తులు, యువతీ యువకుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒడ్నాల శిరీష సత్యం, గ్రామ గౌడ సంఘం కుల పెద్దలు, గౌడ కులస్తులు, గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.