చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి..

విద్యార్థులకు ఎమ్మెల్యే పిలుపు..
అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలకు శ్రీకారం

కైకలూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం కైకలూరు మండలం ఆటపాకలోని నిమ్మగడ్డ నాగభూషణం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల “అమరావతి ఛాంపియన్‌షిప్” క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా సమానంగా ఆసక్తి కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని, శరీర అవయవాలు చురుకుగా పనిచేయడానికి దోహదపడతాయని తెలిపారు.

జీవితంలో అన్ని రంగాల్లో విజయాలు సాధించాలంటే క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించేలా కృషి చేయాలని, ప్రభుత్వం కూడా విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, పోటీతత్వం పెంపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.