యువతకు ఉద్యోగాల పండుగ..
- ఆగస్టు 5న వట్టిచెరుకూరులో మెగా జాబ్ మేళా
- ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
గుంటూరు, ఆంధ్రప్రభ: యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వట్టిచెరుకూరు మండలం ప్రియదర్శిని కళాశాలలో ఆగస్టు 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ మెగా జాబ్ మేళా ద్వారా 31 కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారని గుర్తు చేశారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. అయినప్పటికీ వైసీపీ రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనల పేరుతో అలజడి సృష్టిస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలలకు రంగులు వేయడం తప్ప ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన పేపర్ లీకేజీకి, ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కూడా వైసీపీకి మాట్లాడే హక్కు లేదని బూర్ల రామాంజనేయులు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు రూ.4,500 కోట్ల బకాయిలు పెట్టారని, ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరించి వైసీపీ నేతలు చర్చకు రావాలని ఆయన అన్నారు. గత వైసీపీ పాలనలో రివర్స్ పాలన జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సాయం అందించామని తెలిపారు.
