అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం

అడవుల పరిరక్షణ, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: సిరికొండ రేంజ్ పరిధిలోని పిప్రి గ్రామ తండాలో మంగళవారం అటవీ సంరక్షణ, అటవీ సంపద పరిరక్షణ, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అక్రమంగా చెట్ల నరికివేతను అరికట్టడం వంటి అంశాలపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిరికొండ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నర్సింహారావు మాట్లాడుతూ, అడవులు ప్రకృతికి ఊపిరితిత్తుల వంటివని, వాటిని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

అడవులను పరిరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భావితరాలకు సహజ వనరులను అందించగలమని ఆయన పేర్కొన్నారు.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లచ్చయ్య మాట్లాడుతూ, అడవుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటవీ సంపదను సంరక్షించడంలో స్థానిక ప్రజలు, గ్రామ నాయకులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

ఈ అవగాహన సదస్సులో పిప్రి సర్పంచ్ అరిగెల జనార్దన్, గ్రామ కోరమ్ అధ్యక్షుడు, కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎన్. పోశన్న, అటవీ శాఖ సిబ్బంది, తండా నాయకులు మాలవత్ వెంకటేష్, గోపాల్, శ్రీను, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.