Gold Rate Today-Down | భారీగా తగ్గిన బంగారం ధరలు..
10 గ్రాములపై రూ.1,690 తగ్గుదల..
వెండి కిలోపై రూ.5 వేల కోత
Gold Rate Today-Down | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్న బంగారం ధరలు మంగళవారం ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దిగివచ్చిన ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ మారడం, డాలర్ బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు క్షీణించాయి.

గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం… ఇవాళ ఉదయం 10గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,170గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే 10 గ్రాములపై రూ.1,690 తగ్గడం విశేషం.
అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దీని ధర రూ.1,32,150గా ఉండగా, నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,550 మేర తగ్గింది. దీంతో శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్టైంది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.5 వేల తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,35,000గా కొనసాగుతోంది. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్ కదలికలు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వంటి అంశాలు వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, కేంద్ర బ్యాంకుల విధానాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి మారుతూ ఉంటాయి. రానున్న రోజుల్లో కూడా ఈ అంశాల ప్రభావంతో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
