విద్యార్థుల ఉద్యమాలకు రాజకీయ రంగు పులమొద్దు

  • నా మద్దతు విద్యార్థులకే.. రాజకీయ అజెండాకు కాదు
  • విద్యార్థుల ఆందోళనలకు స్పందించేందుకే నిరసనలో పాల్గొన్నా
  • విద్యార్థుల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారు
  • అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని పిలుపు
  • ఎంపీ కేసినేని చిన్ని కుమార్తె స్నిగ్ధ

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల తాను పాల్గొన్న విద్యార్థుల నిరసన కార్యక్రమంపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుమార్తె కేశినేని స్నిగ్ధ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విద్యార్థుల సమస్యలకు మద్దతుగా మాత్రమే తాను ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని, దానిని రాజకీయ కోణంలో చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు.

తన ఫేస్‌బుక్ పోస్టులో విద్యార్థులకు తమ ఆందోళనలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, వారి సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు లభించాలనే ఉద్దేశంతోనే తాను నిరసన కార్యక్రమానికి హాజరయ్యానని స్పష్టం చేశారు. తన మద్దతు పూర్తిగా విద్యార్థుల ఉద్యమానికేనని, ఏ రాజకీయ అజెండాతోనూ సంబంధం లేదని వెల్లడించారు.

అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి సమస్యలపై పలు సందర్భాల్లో స్పందించి, విద్యా రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.

విద్యార్థుల ఉద్యమాలు వారి సంక్షేమం, సమస్యల పరిష్కారంపైనే కేంద్రీకృతం కావాలని, రాజకీయ కథనాలకు వేదికలుగా మారకూడదని కేశినేని స్నిగ్ధ తన పోస్టులో అభిప్రాయపడ్డారు. విద్యార్థుల అసలు సమస్యలపై చర్చ జరిగి, వాటికి తగిన పరిష్కారాలు లభించే దిశగా అందరూ దృష్టి సారించాలని ఆమె కోరారు.