INDvsSL TEST | శ్రీలంక సిరీస్ కు సీనియ‌ర్లు !?

  • శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జట్టు ప్రకటనకు రంగం సిద్ధం
  • బుమ్రా ఎంపికపై ఉత్కంఠ..
  • కీలక టెస్టు సిరీస్‌కు సన్నాహాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జింబాబ్వే టీ20 సిరీస్‌ను విజయవంతంగా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు శ్రీలంక టెస్టు సిరీస్‌పై దృష్టి సారించింది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును మంగళవారం ఎంపిక కమిటీ ప్రకటించనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న జట్టులో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ఈ ఏడాది భారత్ ఆడిన ఏకైక టెస్టు అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రమే. అయితే అది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) చక్రంలో భాగం కాదు. దీంతో డ‌బ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియాకు ఎలాంటి పాయింట్స్ రాలేదు. అయితే, శ్రీలంకతో జరిగే ఈ రెండు టెస్టులే డబ్ల్యూటీసీ 2025–27లో భారత్‌కు తొలి సిరీస్‌గా నిలవనున్నాయి.

గత ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో 0-2తో ఓటమి పాలైన భారత్, డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంక పర్యటనలో తప్పక విజయం నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సిరీస్‌కు ఎంపిక చేసే జట్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.

ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే స్పిన్‌కు అనుకూలమైన గాలే పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్ల ఎంపిక, మధ్యవరుస బ్యాటర్ల కూర్పుపైనా ఎంపిక కమిటీ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో, ఈ సిరీస్‌కు సంబంధించి యువ బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా అతను ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అత‌ని ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడంతో, సెలక్షన్ కమిటీ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల 104 బంతుల్లో 81 పరుగులు చేసి ఆకట్టుకున్న అతను, స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. అతను అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు ఎదురుదెబ్బగా మారవచ్చు.

సుదర్శన్ స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సహజమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. అతని అంతర్జాతీయ అనుభవం కూడా ఒక సానుకూల అంశంగా పరిగణించబడుతోంది. అయితే, సెలక్షన్ కమిటీ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లను కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, అనుభవజ్ఞుడైన స్టార్ ఆల్-రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్ కోసం టెస్టు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, అతని ఎంపికకు ప్రాధాన్యత లభించినట్లు కనిపిస్తోంది.

మ‌రోవైపు, భారత జట్టు ఫీల్డింగ్‌పై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సగటు ఫీల్డర్లతోనే కొనసాగడం జట్టుకు నష్టం కలిగిస్తుందని, ప్రతి మ్యాచ్‌లో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్ల లోపాలను కెప్టెన్ కప్పిపుచ్చలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.