బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణకు కమిషనర్ వేగం

గుంటూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ: గుంటూరు నగర పరిధిలోని బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణ పనులను నిర్దేశిత ‘రైట్ ఆఫ్ వే’ (ఆర్ఓడబ్ల్యు) మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బృందావన్ గార్డెన్స్ రోడ్ విస్తరణ పనులపై పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే విద్యుత్ స్తంభాలను తరలించేందుకు నగర పాలక సంస్థ తరఫున ఇప్పటికే అవసరమైన మొత్తాన్ని చెల్లించినందున, శనివారం నాటికి ఆ స్తంభాల షిఫ్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అలాగే పట్టణ ప్రణాళిక అధికారులు ఒక అడ్డ రోడ్డు నుండి మరొక అడ్డ రోడ్డు వరకు ప్రభావిత భవనాలను తొలగించిన క్లియర్ ప్రాంతాన్నిక్షుణ్ణంగా మార్కింగ్ చేసి, డ్రైన్ల నిర్మాణం కోసం తక్షణమే ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.

డ్రైన్ నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టడంతో పాటు, ఎప్పటికప్పుడు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో మిగిలిపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని లెవల్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా నివేదిక అందజేయాలన్నారు. మరోవైపు రోడ్డు విస్తరణపై కోర్టు కేసులు ఉన్న స్థల యజమానులను సిటీ ప్లానర్ స్వయంగా కలిసి మాట్లాడాలని ఆదేశించారు. నగర రవాణా అవసరాలు, రోడ్డు విస్తరణ ప్రాధాన్యతను వారికి క్షుణ్ణంగా వివరించి ఒప్పించాలన్నారు. నగర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేసి విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ, ఏడీహెచ్ శాంతి తదితరులు పాల్గొన్నారు.