సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
- ఏపీ టీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ
గుంటూరు అర్బన్, ఆంధ్రప్రభ: విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డేటా సైన్స్,సైబర్ సెక్యూరిటీ వంటి కంప్యూటర్ విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాల అధిరోహించాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీ టీఎస్) చైర్మన్ మోహన్ కృష్ణ పేర్కొన్నారు.
ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, పొనుగుపాడు గ్రామానికి విశేష సేవలు అందించిన ప్రవాసాంధ్రులు కొరిటాల ఇందిరా శేషగిరిరావు సన్మాన కార్యక్రమంలో మన్నవ మోహనకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొరిటాల శేషగిరిరావు నిర్మించిన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను మన్నవ మోహనకృష్ణ ప్రారంభించి మాట్లాడుతూ.. కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణం, పాఠశాల భవనాల మరమ్మతులు, పెయింటింగ్, ఆర్.ఓ.తాగునీటి వ్యవస్థ,ఇంటర్‌లాకింగ్ టైల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేషంగా తోడ్పడి, పొనుగుపాడు గ్రామంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కొరిటాల ఇందిరా శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని మన్నవ కొనియాడారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యను సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, గూగుల్ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలు పంది పుచ్చుకోవాలన్నారు.
