21వ డివిజన్ అభివృద్ధే లక్ష్యం
- ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు అర్బన్, ఆంధ్రప్రభ: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లో అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం పలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, వెట్‌మిక్స్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.ఈ సందర్భంగా కోదండరామయ్య నగర్ 4వ లైన్, కేవీపీ కాలనీ 3వ లైన్, శశాంక్ గోయల్ కాలనీలోని జెమిని స్కూల్ సమీపం, గడ్డిమల్లు జీరో లైన్ ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. 21వ డివిజన్లో దాదాపు రూ.3.5 కోట్ల విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, వెట్‌మిక్స్ రోడ్ల పనులను ప్రారంభించడం ఆనందంగా ఉందని,కోదండరామయ్య నగర్,కొండా వెంకటప్పయ్య కాలనీ,శశాంక్ గోయల్ కాలనీ, భానుప్రసాద్ కాలనీ,గడ్డిమల్లు తదితర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ప్రజలు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాల లేమితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు,నిర్మాణ సంస్థలు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోవడంతో టెండర్లు పూర్తయినా పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొందని,ఒకే ప్రాంతంలో ఒక రోడ్డు పూర్తవగా పక్కనే మరో రోడ్డు పనులు నిలిచిపోయే పరిస్థితిని ప్రజలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు రీ-టెండర్లు నిర్వహించి కొత్త కాంట్రాక్టర్ల ద్వారా పనులను పునఃప్రారంభించామని గళ్ళా మాధవి తెలిపారు.
ఇప్పటికే 21వ డివిజన్లో రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం మరో రూ.3.5 కోట్ల పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. మొత్తం మీద ఈ డివిజన్లో సుమారు రూ.10 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని,మిగిలిన పనులను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని,గత రెండు సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోని ప్రాంతాల్లో సైతం పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు.21వ డివిజన్లో ఖాళీ స్థలాలు అధికంగా ఉండటంతో వాటి వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ప్రజల ఫిర్యాదుల మేరకు ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.జీఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఖాళీ స్థలాల క్లియరెన్స్ డ్రైవ్ చేపడుతున్నారని, ప్రస్తుతం ఆదర్శ్‌నగర్, మిర్చియార్డు ప్రాంతాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని త్వరలో 21వ డివిజన్లో కూడా అమలు చేసి అన్ని ఖాళీ స్థలాలను శుభ్రం చేయనున్నట్లు తెలిపారు.వీఐపీ రోడ్డును ఇటీవల అభివృద్ధి చేసి రోడ్డు నిర్మాణంతో పాటు కల్వర్టు,ప్లాంటేషన్ పనులు పూర్తి చేశామని చెప్పారు.స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ లోడ్లతో వచ్చే వాహనాలు గట్టర్లను దెబ్బతీస్తున్న సమస్యపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గతంలో ఖాళీ స్థలాల కారణంగా గంజాయి వంటి సామాజిక సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రత్యేక డ్రైవ్‌లు, రెగ్యులర్ బీట్ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్ చర్యల వల్ల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు.మిగిలిన ప్రాంతాల్లో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.ఇటీవల మహిళా గ్రీవెన్స్ కార్యక్రమానికి గడ్డిమల్లు ప్రాంత మహిళలు వచ్చి తమ ప్రాంతంలో దయనీయంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి వినతిపై స్పందించి కేవలం రెండు వారాల్లోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ పనులు పూర్తై ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
