వసతి గృహాల టెండర్లపై ఆరోపణలు

నిబంధనలు ఉల్లంఘించారా..?

అనుకూల కాంట్రాక్టర్లకే అవకాశం ఇచ్చారంటూ ఫిర్యాదులు

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకుల, జ్యోతిబాపూలే, ఆదర్శ పాఠశాలల వసతి గృహాలకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, గ్యాస్ తదితర వస్తువుల సరఫరా కోసం నిర్వహించిన టెండర్లపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

సరఫరా కాంట్రాక్టర్ల నుంచి సీల్డ్ టెండర్లను ఆహ్వానించి, కొనుగోలు కమిటీ ద్వారా అర్హులైన, తక్కువ ధరకు సరఫరా చేసేవారికి కాంట్రాక్టులు అప్పగించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీల్డ్ టెండర్లు తీసుకోవాల్సిన చోట ఓపెన్ టెండర్లు స్వీకరించారని, టెండర్లలో పాల్గొన్న కొందరు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు సైతం అవకాశం కల్పించినట్లు వారు పేర్కొంటున్నారు.

జిల్లాలోని ఐదు జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలు, ఐదు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, నాలుగు మైనారిటీ గురుకులాలు, రెండు ఆదర్శ పాఠశాలలకు సంబంధించి ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించారు.

ఈ టెండర్లను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు దక్కేలా కోఆర్డినేటర్లు వ్యవహరించారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒకే కాంట్రాక్టర్‌కు 15 వరకు పాఠశాలల కాంట్రాక్టులు వచ్చేలా అధికారులు వ్యవహరించినట్లు తెలుస్తోందని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు.

అర్హులైన వారిని పక్కన పెట్టి అనుకూలమైన కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ నిధులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. టెండర్ల నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించినట్లు కనిపించేలా వ్యవహరించారని విమర్శిస్తున్నారు.

ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు తెలిపారు.

ఇకనైనా వసతి గృహాల వస్తువుల సరఫరా టెండర్లలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.