కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాల ప్రచారానికి శ్రీకారం
- ఎర్రావారిపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పులివర్తి నాని
- ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రభ: ఎర్రావారిపాలెం మండలం చింతగుంట పంచాయతీ నాగినేనివారిపల్లి గ్రామంలో “కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” పేరుతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్-6 హామీలు, రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” నినాదానికి అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల సమస్యలు, అవసరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలో జరిగిన అభివృద్ధి, యువతకు కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
