ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలి: ఐటీడీఏ పీఓ మంద మకరందు
ఉట్నూర్ ఆంధ్రప్రభ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉట్నూర్ మండలం సాలెవాడ గ్రామస్తులు తమ గ్రామానికి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం చిత్రు తనకు పట్టా ఇప్పించాలని కోరారు. ఆసిఫాబాద్ మండలం మాణిక్గూడ గ్రామానికి చెందిన భీము ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ పీఈటీ ఉద్యోగం ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.
ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని పీఓ మంద మకరందు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ వసంతరావు జాదవ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి ప్రేమకల, పీవీటీజీ ఏపీఓ ఆత్రం భాస్కర్, ఏజెన్సీ విద్యాశాఖ అధికారి గోడం చందన్, జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్ కుమార్, పెసా జిల్లా కోఆర్డినేటర్ ఆర్క వసంతరావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, గిరిజనులు పాల్గొన్నారు.
