చిన్నకాపర్తి విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
చట్టాలపై అవగాహనతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
చిట్యాల, ఆంధ్రప్రభ: చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో షీ టీం, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి పానుగోత్ సైదానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి షీ టీం నల్గొండ ఎస్సై ఎం.డి. ఘౌస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బాలికలు, మహిళలను వేధించడం, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు పోలీసులను సంప్రదించాలని సూచించారు.
సోషల్ మీడియాను విద్యార్థులు జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులతో ఆన్‌లైన్‌లో స్నేహాలు చేయడం, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.
షీ టీం హెడ్ కానిస్టేబుల్ నర్సింహ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు తమకు ఎదురయ్యే వేధింపులు, ఇబ్బందులను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
షీ టీం అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మి మాట్లాడుతూ.. బాలికలు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉపయోగించాలని, అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దని తెలిపారు. ఎవరైనా వేధించినా, బెదిరించినా లేదా అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
చిట్యాల ఏఎస్ఐ వెంకటయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను అవసరమైన మేరకే ఉపయోగించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మండల విద్యాధికారి పానుగోత్ సైదా నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత, భవిష్యత్తు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యతో పాటు సమాజంపై అవగాహన, మంచి విలువలు, క్రమశిక్షణ ఎంతో అవసరమని తెలిపారు.
ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏఎస్ఐ విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. బాలలు, మహిళలను అక్రమ రవాణా చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడంలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జాగృతి కళాబృందం నల్గొండ ఇన్‌చార్జి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కళాబృందం సభ్యులు పాటలు, కళారూపాల ద్వారా మహిళలు, బాలికల భద్రత, మానవ అక్రమ రవాణా, బాలల రక్షణ, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది, ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది, చిట్యాల పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
