Cloak-Room-Overcharging : శాల్తీ @ రూ. 30లే..! Andhra Prabha Top Story

Cloak-Room-Overcharging : శాల్తీ @ రూ. 30లే..! Andhra Prabha Top Story

  • క్లోక్‌రూమ్‌లో పిండుడే
  • ఒక్కో బ్యాగ్‌కు రూ. 10 మాత్ర‌మే
  • మూడు రెట్లు చార్జీ అద‌నం
  • వ‌స్తువుల‌కు భ‌ద్ర‌త అడ‌గొద్దు
  • నిత్యం భ‌క్తుల‌తో ఘ‌ర్ష‌ణ‌లు
  • జీరో ర‌సీదుతో స‌రి
  • అడిగితే పాత తేదీ తో ర‌శీదు ప్ర‌త్య‌క్షం
  • తిరుమ‌ల‌లో ఉచితంగా క్లోక్ రూమ్‌లు…
  • ఇంద్ర‌కీలాద్రిపైనే నిలువు దోపిడీ
  • ఇంత‌కీ సూప‌రింటెండెట్లు ఎక్క‌డ ?

(ఆంధ్ర‌ప్ర‌భ‌, ఎన్టీఆర్ బ్యూరో)

ఇంద్ర‌కీలాద్రిపై భ‌క్తుల నిలువుదోపిడీ కొన‌సాగుతోంది. ఎవ‌రికి వారే వారికి తోచిన రీతిలో భ‌క్తుల‌ను దోచుకుంటున్నారు. నిత్యం ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌తో క‌ళ‌క‌ళ‌లాడే తిరుమ‌ల‌లోనే ఉచితంగా వ‌స్తువులు భ‌ద్ర‌ప‌ర‌చుకొనే అవ‌కాశం ఇస్తుంటే విజ‌య‌వాడ దుర్గ‌గుడిలో మాత్రం ప్ర‌తి దానికి ఒక రేటు అంటూ వ‌సూలు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. భ‌క్తులు భ‌ద్ర‌ప‌ర‌చుకునే పాద‌ర‌క్ష‌లు, వ‌స్తువుల‌కు డ‌బ్బులు వ‌సూలు చేస్తూ ఆధ్యాత్మి కేంద్రాన్ని వ్యాప‌ర సంస్థ‌గా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి అమ్మ‌వారి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు వారి సామ‌గ్రిని క్లోక్ రూమ్‌లోభ‌ద్ర‌ప‌ర‌చుకుంటారు.

అయితే అక్క‌డ ఒక్కో శాల్తీకి కేవ‌లం ప‌ది రూపాయ‌లు మాత్ర‌మే వ‌సూలు చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ అందుకు విరుద్ధంగా రూ. 30 వ‌సూలు చేయ‌డంపై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక్కో కుటుంబం ద‌ర్శ‌నానికి వ‌స్తే వారి సామ‌గ్రి 3 నుంచి 5 శాల్తీలు ఉంటే 100 నుంచి 150 రూపాయ‌లు స‌మ‌ర్పించుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. అదేవిధంగా పాత తేదీల‌తో ఎంత వ‌సూలు చేస్తున్నారో లేని బిల్లులు ఇస్తూ భ‌క్తుల‌ను నిలువు దోపిడీ చేస్తున్నారు. భ‌క్తుల సామ‌గ్రి కూడా ఇష్టానుసారం ప‌డేస్తుండ‌డంతో వారి విలువైన వ‌స్తువులు ధ్వంస‌మ‌వుతున్నాయి. దానికితోడు ఇక్క‌డ వాటికి ఎటువంటి భ‌ద్ర‌త కూడా లేక‌పోవ‌డంపై కూడా భ‌క్తులు మండిప‌డుతున్నారు. కాంట్రాక్ట‌ర్ల నుంచి ల‌క్ష‌ల్లో వ‌సూలు చేసే దేవ‌స్థానం క్లోక్ రూమ్‌కు అనువైన గ‌దుల‌ను కేటాయించాల్సి ఉన్నా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో భ‌క్తుల సామ‌గ్రికి భ‌ద్ర‌త కొర‌వ‌డింది. అధిక ధ‌ర‌లు వ‌సూళ్ల‌పై నిత్యం ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతున్నా పరిస్థితుల్లో ఆలయ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది.

Cloak-Room-Overcharging :మరి ఇంత దోపిడీనా.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ లగేజీని భద్రపరుచుకునేందుకు క్లాక్ రూములను ఆశ్రయిస్తుంటారు. దేవస్థానం వేలంపాట ద్వారా దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ఒక బ్యాగ్ కి రూ 10 రూపాయల చొప్పున వసూలు చేయాల్సి ఉన్నప్పటికి, నిబంధనలకు విరుద్ధంగా రూ 30/- పైనే వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. బ్యాగు భద్రపరిచే సమయంలో ఇవ్వాల్సిన రసీదులో కూడా స్పష్టత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. బ్యాగు తీసుకున్న క్లోక్ రూమ్ సిబ్బంది సంబంధిత వ్యక్తికి ఒక రసీదును ఏ రోజు ఇచ్చాడు ఏ సమయంలో ఇచ్చాడు ఎంత ఛార్జ్ చేస్తున్నది స్పష్టంగా తెలియజేస్తూ రసీదు ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే క్లోక్ రూంలోని సిబ్బంది రీసైకిల్ చేసిన టోకెన్లను ఇస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం అత్యంత రద్దీగా ఉన్న సమయంలో సిబ్బంది 25వ తేదీ రసీదులను ఇవ్వడంతో కొంతమంది భక్తులు ప్రశ్నించారు. ఇదే సమయంలో వారికి చార్జి చేస్తున్న వివరాలు కూడా రసీదుపై లేకపోవడం జీరో అని ఉండడంతో ప్రశ్నించారు. బ్యాగ్ తీసుకునే సమయంలో కూడా రూ 30 రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా భక్తులు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది భక్తులు ఇదే అంశంలో క్లోక్ రూమ్స్ సిబ్బందితో వాదన జరిగిన సంఘటన కూడా జరిగింది. తిరుమలలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భద్రపరుస్తుంటే ఇక్కడ రూ 30 రూపాయలు తీసుకోవడమేంటి ఇంత దారుణమా అంటూ ప్రశ్నించారు. బ్యాగులు భద్రపరిచే ప్రాంతం కూడా అంత సేఫ్ గా లేదంటున్న వాళ్లు మా బ్యాగులను మేమే వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుందని రసీదు పై కాస్త నెంబర్ కూడా వేయడం లేదని అంటున్నారు.