tiffin| ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
tiffin| ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చిన్నారులతో అల్పాహారం చేసిన భట్టి
భావితరాలపై ప్రభుత్వ పెట్టుబడి
అర్ధాకలితో ఏ బిడ్డా బడికి వెళ్లొద్దు
పోషకాహార పథకానికి భట్టి ప్రశంసలు
విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు
మానవ వనరులే అసలైన సంపద
పోషకాహార అల్పాహారానికి ప్రభుత్వం పెద్దపీట
ఖమ్మం/మధిర, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన, అది తన రాజకీయ జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతికత, పరిశుభ్రమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ కమ్యూనిటీ కిచెన్ ద్వారా ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం అభినందనీయమని భట్టి విక్రమార్క అన్నారు.
ఏ బిడ్డా అర్ధాకలితో పాఠశాలకు వెళ్లకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత పోషకాహార అల్పాహార పథకం ఉచిత పథకం కాదని, భావితరాలపై ప్రభుత్వం చేస్తున్న పెట్టుబడని వ్యాఖ్యానించారు.

మానవ వనరులే రాష్ట్రానికి అసలైన సంపద అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి విద్యార్థిని సానబెట్టిన వజ్రంలా తీర్చిదిద్ది ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పాలన అంటే పెత్తనం కాదని, సమాజ హితం కోసం వనరులను వినియోగించి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే నిజమైన పాలన అని పేర్కొన్నారు.
ప్రజల మధ్య నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’లో తాను చూసిన సమస్యలే నేడు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలుగా రూపుదిద్దుకున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
