పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలి : బోడ అనిల్ నాయక్

ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి కృతజ్ఞతలు

నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే, ఉద్యమనేత పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు రావాలని తెలంగాణ రక్షణ సేన నర్సంపేట నియోజకవర్గ బాధ్యులు బోడ అనిల్ నాయక్ ఆకాంక్షించారు.

ఆదివారం గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందించిన వైద్య బృందానికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులకు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రోహిణి ఆసుపత్రి వైద్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి పలుమార్లు సీపీఆర్ నిర్వహించి ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా డాక్టర్ మమతతో పాటు వైద్య సిబ్బంది చూపిన సేవాభావానికి నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన నాయకుడని, ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు విశేషంగా కృషి చేశారని బోడ అనిల్ నాయక్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిలా గుర్తింపు పొందిన ఆయన డబ్బుతో ఎదిగిన నాయకుడు కాదని, ప్రజల విశ్వాసంతో ఎదిగిన నిజమైన ప్రజానాయకుడని కొనియాడారు.

రాజకీయాలు వేర్వేరైనా ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకులు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన సేవలను కొనసాగించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని బోడ అనిల్ నాయక్ పిలుపునిచ్చారు.