యూజీడీ పనుల్లో అవినీతి జరుగుతోంది

బొల్లం మల్లయ్య యాదవ్

పనులను వెంటనే నిలిపివేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్

కోదాడ, ఆంధ్రప్రభ : కోదాడ పట్టణంలో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల పేరుతో భారీ అవినీతి జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. నాణ్యతలేని నిర్మాణ పనులతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారం కోదాడలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న యూజీడీ పనులు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కంటే కొత్త సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

2004 నుంచి 2009 మధ్యకాలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ పట్టణంతో పాటు 40 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సింగారం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే ఇంజినీరింగ్ వైఫల్యాల పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ జరిగిందని, ప్రస్తుతం యూజీడీ ప్రాజెక్టును కూడా అవినీతికి కేంద్రంగా మార్చారని ఆరోపించారు.

యూజీడీ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు టెండర్ విలువ రూ.182 కోట్లు మాత్రమే కాగా, ప్రజలకు విడుదల చేసిన ప్రకటనల్లో రూ.258 కోట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. ఈ రెండు మొత్తాల మధ్య ఉన్న వ్యత్యాసంపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం యూజీడీ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ బ్లాక్‌లిస్టులో ఉన్న సంస్థ అని, ఆ సంస్థపై కోర్టుల్లో కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నప్పటికీ అదే సంస్థకు పనులు అప్పగించడం వెనుక కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే సంస్థలకు ఇలాంటి పనులు అప్పగించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

కోదాడ పట్టణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, అనుభవజ్ఞులైన ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులను పునఃప్రారంభించాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా పనులు నిర్వహిస్తేనే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

పట్టణ అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. నర్సరీల్లో నాటిన మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించగా సిబ్బంది కొరత ఉందని సమాధానం చెప్పారని తెలిపారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మున్సిపాలిటీలో 70 మంది కార్మికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించామని, ప్రభుత్వం మారిన తర్వాత వారందరినీ తొలగించడంతో పట్టణ పారిశుద్ధ్యం, నిర్వహణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న యూజీడీ పనులు నాసిరకంగా సాగుతున్నందున భవిష్యత్తులో ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే ఈ పనులను నిలిపివేసి, బ్లాక్‌లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కోదాడ నియోజకవర్గంలో అవకాశం ఉన్న ప్రతి చోట అవినీతి చోటుచేసుకుంటోందని ఆరోపించిన ఆయన, ప్రజలు మోసపోకుండా కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు. కోదాడలో జరుగుతున్న అవినీతిని అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని యూజీడీ పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని, బ్లాక్‌లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ను తొలగించి నాణ్యతా ప్రమాణాలతో పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.