ధర్మసాగర్ కాలువ ద్వారా సాగునీటి విడుదల..

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ: రైతులకు అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ నుంచి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో స్వాగతం పలికి కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. హసన్‌పర్తి, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల పరిధిలోని పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, వర్షాలు సమృద్ధిగా కురిస్తే రైతులకు నిరంతరం నీటి సరఫరా కొనసాగుతుందని కేఆర్ నాగరాజు పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ బానోత్ సింగులాల్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.