Indrakeeladri | వైభవంగా కనకదుర్గమ్మకు బంగారు బోనం…

  • ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం
  • తెలంగాణ నుంచి ఘనంగా బంగారు బోనం సమర్పణ..
  • అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
  • 67,466 మంది అమ్మవారి దర్శనం


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ సారె మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 13వ రోజు ఆదివారం తెలంగాణ నుంచి సంప్రదాయబద్ధంగా బంగారు బోనాన్ని ఘనంగా సమర్పించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది కళాకారులు, 2,000 మంది భక్తులు పాల్గొన్నారు.

జమ్మిదొడ్డి సెంటర్ నుంచి మంగళ వాయిద్యాలు, బేతాళ నృత్య ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా ఘాట్ రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) బోనం బృందానికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..

ఆదివారం అమ్మవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆదివారం ఆలయ వివరాలు..

దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆదివారం ఒక్కరోజే 67,466 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 4,978 దర్శన టికెట్లు జారీ చేయగా, 1,25,364 ప్రసాదాలు విక్రయమయ్యాయి. హుండీకి వెలుపల విరాళాల రూపంలో రూ.2,70,872 అందాయి. 289 ఆర్జిత సేవలు నిర్వహించగా, 3,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఉచిత అన్నదానాన్ని 13,133 మంది భక్తులు స్వీకరించారు. ఆషాఢ సారె మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండటంతో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి, దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, భద్రతా చర్యలను సమన్వయంతో నిర్వహిస్తున్నారు.