rain| తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక
ఐఎండీ అలర్ట్.. అప్రమత్తంగా ఉండండి
ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో విస్తార వర్షాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
మరోసారి వర్షాల ముప్పు
రాష్ట్రవ్యాప్తంగా వానల జోరు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఐఎండీ అంచనాల ప్రకారం సోమవారం రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం, రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు మినహా వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని, ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
