30న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి

సీఐటీయూ మండల కార్యదర్శి మహేష్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనం, పీఎఫ్ , ఈఎస్ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ మండల కార్యదర్శి మహేష్ కోరారు. కొండపల్లి ఐడీఏలోని హెచ్ పీ ప్లాంట్ వద్ద సోమవారం ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి పారిశ్రామికవాడలో హాస్పటల్ ను పునః ప్రారంభించాలని, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ కాలుష్యాన్ని నివారించాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు ముఖ్యంగా మహిళా కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కొండపల్లి పారిశ్రామిక కేంద్రంలోని ఆయిల్ సెక్టార్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని పెయిడ్ హాలిడేస్, ఓటీలు ఇవ్వాలని కోరారు. డ్రైవర్స్ పై పనిభారం తగ్గించాలని భద్రత ప్రమాణాలు పాటించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఠా కార్మికులకు కనీస వేతనంతో కూడిన కూలి రేట్లు పెంచాలన్నారు. కనీస వేతనం అమలుకు ఈనెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు టి.రమేష్, పి.శేషగిరిరావు, శివాజీ, గోపి, దయాకర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.