ఎల్‌నినోపై తెలంగాణ కేబినెట్ ఆందోళన

  • వర్షాభావంపై కేంద్రానికి లేఖ..
  • ప్రత్యేక బృందం పంపాలని విజ్ఞప్తి..
  • తాగునీరు, విద్యుత్, సాగునీటిపై ప్రత్యేక కార్యాచరణ..
  • ధరణి అక్రమాలపై సిట్ విచారణకు నిర్ణయం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన 36వ మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాయాలని, వర్షాభావ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కూడా కేంద్రాన్ని కోరాలని కేబినెట్ తీర్మానించింది.

రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రిమండలి సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదని, చాలా ప్రాంతాల్లో 30 నుంచి 35 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజాభవన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్ నంబర్ 1800-123-7157గా ప్రకటించారు.

రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని మంత్రిమండలి ఆదేశించింది. విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని, ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిర్ణయించింది. రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది.

వర్షాభావ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిన కేబినెట్, ఈ నెల 20న ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా నష్టంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణులతో ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని సూచించింది.

ధరణి అక్రమాలపై సిట్ విచారణ

భూముల రికార్డులు, క్రయవిక్రయాలకు సంబంధించిన ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ నుంచి ప్రారంభించి ఇటీవల వెలువడిన ఆరోపణల వరకు అన్ని అంశాలపై విచారణ జరపనుంది. 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించింది.

మరిన్ని కీలక నిర్ణయాలు

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసేందుకు తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం-2019 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ పంచాయతీ నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో సవరణకు కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు ఈ నిర్ణయాలను వెల్లడించారు.