మునుగోడు ఎస్సైగా శోభన్‌బాబు బాధ్యతల స్వీకరణ

  • అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

మునుగోడు, ఆంధ్రప్రభ: మునుగోడు పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా శోభన్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా గుండాల పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా ఎస్సై శోభన్‌బాబు మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసే వారు, నేరాలకు పాల్పడే వారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు. చట్టాన్ని ధిక్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమాలకు పాల్పడే వారికి తాను సింహస్వప్నంగా ఉంటానని స్పష్టం చేశారు.

మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. గంజాయి, అక్రమ మద్యం, జూదం, బెట్టింగ్‌లు, మహిళలపై వేధింపులు, రౌడీయిజం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు.

ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందిస్తూనే, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్సై శోభన్‌బాబు విజ్ఞప్తి చేశారు.