యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: రేణుకా చౌదరి

  • రూ. 35 లక్షలతో దమ్మపేటలో నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన
  • దమ్మపేట అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేసిన ఎంపీ రఘురాం రెడ్డి
  • పాల్గొన్న ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పీఓ రాహుల్

దమ్మపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో రూ.35 లక్షల ఐటీడీఏ నిధులతో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శుక్రవారం సాయంత్రం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబులు ముఖ్య అతిథులుగా హాజరై భూమిపూజ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పుస్తక పఠనంతో పాటు ‘ఏఐ’పై దృష్టి పెట్టాలని , గ్రంథాలయాలు సరస్వతీ నిలయాలని, ప్రస్తుత ఆధునిక కాలంలో పుస్తకాలు చదవడంతో పాటుగా యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సూచించారు.

ప్రతి ఒక్కరూ నెలకు కనీసం ఒక పుస్తకాన్ని కొనుగోలు చేసి ఈ లైబ్రరీకి విరాళంగా అందించాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై ఆమె కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దమ్మపేట ప్రాంతంలో మహిళల కోసం ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని ఎంపీ రఘురాం రెడ్డిని ఆమె కోరారు. ఇందుకు తన వంతు సహకారం కూడా ఉంటుందన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మన హక్కుల సాధన కోసం పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ దమ్మపేట పట్టణంలో నెలకొన్న తాగునీటి పైపుల సమస్యను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఆదినారాయణను రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలు భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంతమైన దమ్మపేటలో అధునాతన లైబ్రరీ భవన నిర్మాణానికి అడిగిన వెంటనే రూ. 35 లక్షలు మంజూరు చేసిన ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ రంగంలో విశేష కృషి చేసినందుకు పీఓ జాతీయ స్థాయి అవార్డు సాధించడం గర్వకారణమన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దమ్మపేట అభివృద్ధికి కోటి రూపాయల ఎంపీ నిధులు మంజూరు చేసిన రఘురాం రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు అద్భుత విజయాన్ని అందించారని గుర్తుచేశారు.

ఒకప్పుడు లైబ్రరీలు కేవలం దినపత్రికలు చదివేందుకే పరిమితం అయ్యేవని, కానీ నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించడంలో ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయని ఐటీడీఏ పీఓ రాహుల్ పేర్కొన్నారు.

అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో గిరిజన శిక్షణా భవనం మంజూరైందని, వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ భవనంలో శిక్షణ తరగతులను నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ దమ్మపేటలో గ్రంథాలయ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో ఎమ్మెల్యే ఆదినారాయణ పాత్ర ఎనలేనిదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధా కిషోర్, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, పట్టణ అధ్యక్షుడు చిన్నశెట్టి చిట్టిబాబు ,దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు ,చిన్నశెట్టి యుగంధర్, శ్రీరాముల ప్రసాద్, పగడాల రాంబాబు, దిశా కమిటీ సభ్యురాలు సొంగా ఏసుమణి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పొడపాటి భారతి ,పొదిలి జ్యోతి, అయ్యప్ప , తదితరులు పాల్గొన్నారు.