ఏపీ టూరిజం లో ఏపీటీడీసీదే కీలక పాత్ర
- ఏపీటీడీసీ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన చైర్మన్ డా. నూకసాని బాలాజీ
- హోటళ్ల ఆక్యుపెన్సీ పెంపు, వాటర్ ఫ్లీట్ భద్రత, ఆదాయ వృద్ధిపై స్పష్టమైన ఆదేశాలు
- విజయవాడ, శ్రీశైలం, వాడపల్లి సహా కొత్త టూర్ ప్యాకేజీల రూపకల్పనకు గ్రీన్ సిగ్నల్
- బకాయిల వసూళ్లు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, విజిలెన్స్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి
- పర్యాటకులకు నాణ్యమైన సేవలే లక్ష్యం..
- ఏపీటీడీసీని రాష్ట్ర అభివృద్ధికి చోదకశక్తిగా తీర్చిదిద్దుతాం
- ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)ని ఆదాయపరంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీటీడీసీ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
విభాగాల పనితీరుపై సమీక్ష
ఏపీటీడీసీ పరిధిలోని హోటళ్లు, వాటర్ ఫ్లీట్, ఆర్థిక విభాగం, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీ-పీ-పీ), ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, న్యాయ, విజిలెన్స్, పరిపాలన విభాగాల పనితీరు, ఆదాయ వృద్ధి, పెండింగ్ అంశాలు, పరిపాలనా వ్యవహారాలపై డా. నూకసాని బాలాజీ విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీటీడీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రతి విభాగం ఫలితాల ఆధారంగా పనిచేసి సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందించాలి” అని స్పష్టం చేశారు.
హోటళ్లు, వాటర్ ఫ్లీట్‌పై ప్రత్యేక దృష్టి
ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచేందుకు వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయాలని, సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న వాటర్ ఫ్లీట్ యూనిట్లలో భద్రతకు రాజీ లేకుండా క్రమం తప్పకుండా సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని సూచించారు. లీజుదారుల వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిలను వేగంగా వసూలు చేసి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయాలని, ప్రధాన కార్యాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు.
పారదర్శక పాలనకు ప్రాధాన్యం
పెండింగ్ న్యాయ వ్యవహారాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు విజిలెన్స్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కొత్త టూర్ ప్యాకేజీల రూపకల్పన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపునిచ్చే విధంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడ స్థానిక దర్శనంతో పాటు శ్రీశైలం, వాడపల్లి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలను అనుసంధానిస్తూ ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను రూపొందించాలని సూచించారు.
నాలుగు అంశాలే ప్రధాన స్తంభాలు
ఆదాయ వృద్ధి, నాణ్యమైన సేవలు, భద్రతా ప్రమాణాల అమలు, పారదర్శక పరిపాలన… ఈ నాలుగు అంశాలే ఏపీటీడీసీ భవిష్యత్ కార్యాచరణకు ప్రధాన స్తంభాలు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఏపీటీడీసీ కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం” అని డా. నూకసాని బాలాజీ పేర్కొన్నారు. సంస్థలో ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని, పర్యాటకులకు అంతర్జాతీయ ప్రమాణాల సేవలు అందించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షతో ఏపీటీడీసీ కార్యకలాపాలకు కొత్త కార్యాచరణ రూపుదిద్దుకోనుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
