మైనర్ భవిష్యత్తు కాపాడిన శక్తి బృందం..

  • ఆదోని కానిస్టేబుళ్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రశంసా పత్రాలు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : బాల్య వివాహాన్ని అడ్డుకుని ఓ మైనర్ బాలిక భవిష్యత్తును కాపాడిన ఆదోని శక్తి బృందం పోలీసు కానిస్టేబుళ్లు కె. రాజేశ్వరి, ఎస్. వీరాంజనేయులను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. పిల్లల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

సమాచారం అందగానే వేగంగా స్పందన

ఇటీవల ఆదోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికకు బాల్య వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో శక్తి బృందం కానిస్టేబుళ్లు కె. రాజేశ్వరి, ఎస్. వీరాంజనేయులు వెంటనే స్పందించారు. ఐసీడీఎస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, గ్రామ సచివాలయ అధికారులతో సమన్వయం చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

బాలిక కుటుంబ సభ్యులకు అధికారులు, పోలీసులు కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, దీనివల్ల బాలిక విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వివరించి అవగాహన కల్పించారు. దీంతో కుటుంబ సభ్యులు బాల్య వివాహాన్ని విరమించుకోవడంతో మైనర్ బాలిక భవిష్యత్తు రక్షితమైంది.

సమాచారం వెంటనే ఇవ్వాలి: ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు, డయల్–112కు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలపై పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సేవలకు ప్రత్యేక అభినందనలు

పిల్లల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసి బాల్య వివాహాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన శక్తి బృందం కానిస్టేబుళ్లు కె. రాజేశ్వరి, ఎస్. వీరాంజనేయులతో పాటు సహకరించిన ఐసీడీఎస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మస్తాన్ వలి పాల్గొన్నారు.