అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 7, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఇదే గడువులోగా చెల్లించాలని అధికారులు సూచించారు.

ఉద్యోగులు, గృహిణులు, ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారు, రెగ్యులర్ కళాశాలల్లో చేరే అవకాశం లేని విద్యార్థులకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రవేశాలు పొందుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా వివిధ విభాగాల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

కోర్సుల అర్హతలు, ఫీజు వివరాలు, ప్రవేశ విధానం, ఆన్‌లైన్ నమోదు తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు braouonline.in లేదా braou.ac.in అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. అదనపు వివరాల కోసం సమీప అధ్యయన కేంద్రం లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.