AP | ప్రపంచ స్థాయి క్రికెటర్లను తయారు చేస్తాం..
గ్రామీణ ప్రతిభే లక్ష్యం.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల తయారీపై దృష్టి..
ఏపీఎల్ పోటీలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తం…
యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం
ఐపీఎల్, టీమిండియాకు ఏపీ నుంచి అధిక సంఖ్యలో ఆటగాళ్లను పంపిస్తం..
ఏసీఏ ఆపరేషన్ డైరెక్టర్ దొడ్డపునేని కళ్యాణ్ కృష్ణ..
(విజయవాడ, ఆంధ్రప్రభ) : ప్రపంచస్థాయి క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్‌కు సేవలను అందించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ దొడ్డపునేని చైతన్య కృష్ణ తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆపరేషన్స్ డైరెక్టర్‌గా విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్, కామెంటేటర్ దొడ్డపనేని కళ్యాణకృష్ణ, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అసోసియేషన్ లక్ష్యాలు, ఏపీఎల్ విస్తరణ, గ్రామీణ యువతకు అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి కోచింగ్ వంటి అంశాలను వివరించారు. క్రికెట్‌ను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లడమే ఏసీఏ ప్రధాన లక్ష్యమని కళ్యాణకృష్ణ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి, వారికి అత్యుత్తమ శిక్షణ, ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఐపీఎల్, భారత జట్టుకు ఆటగాళ్లను అందించడమే తమ సంకల్పమన్నారు. ఏపీఎల్‌ను ఇకపై విశాఖపట్నం మాత్రమే కాకుండా మంగళగిరి, కడప తదితర ప్రాంతాల్లో విజయవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌కు విశేష ఆదరణ లభించిందన్నారు. రాబోయే సీజన్లలో మరిన్ని నగరాల్లో ఏపీఎల్ నిర్వహించి ప్రతి ప్రాంతానికి క్రికెట్‌ను చేరువ చేస్తామని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ వంటి అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీసుకువచ్చి కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేసిందని తెలిపారు. ఆధునిక శిక్షణ, ఫిట్నెస్, సాంకేతిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ‘ఫాస్ట్ బౌలింగ్ హంట్’ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు.
స్పీడ్ గన్స్ సహాయంతో వేగవంతమైన బౌలర్లను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించే ప్రణాళిక సిద్ధమైందన్నారు. ప్రతి జిల్లాలో ట్రయల్స్ నిర్వహించి ప్రతిభావంతులైన యువకులను ఎంపిక చేస్తామని వివరించారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన మైదానాలు, అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన కోచ్‌లు అందుబాటులోకి వస్తే ఆటోమేటిక్‌గా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు తయారవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్లి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎల్, భారత జట్టుకు మరింత మంది క్రికెటర్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తనకు అవకాశం కల్పించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శికి కళ్యాణకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కార్యవర్గం నాయకత్వంలో ఆంధ్ర క్రికెట్ దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
